మనకు వర్షాలు లేకపోయినా ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. కారణం ఇదే!

  • ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
  • గోదావరి నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు
  • పోలవరం స్పిల్ వే గేట్లను ఎత్తివేసిన అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఈ సమయానికి కురవాల్సిన సాధారణ వర్ష శాతం కంటే తక్కువ శాతం వర్షాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిశాయి. ఇదంతా ఒకవైపు. మరోవైపు గోదావరి నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. క్రమంగా గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. దీనికి కారుణం... ఎగువన మహారాష్ట్ర, ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలే. భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగిపొర్లుతూ గోదావరిలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో వరద ప్రవాహం భారీగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా లక్ష క్యూసెక్కుల నీరు ఉరకలెత్తుతోంది. దీంతో, అలర్ట్ అయిన జలవనరుల శాఖ అధికారులు 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


అయితే, స్పిల్‌వే నుంచి వరద నీరు ఊహించని వేగంతో దూసుకురావడంతో.. స్పిల్‌ చానల్‌ మధ్య 902 హిల్‌ నుంచి మహానందీశ్వరస్వామి టెంపుల్ వరకు ఉన్న మట్టి, రాతి రవాణా కాజ్‌వేకు గండిపడింది. ప్రాజెక్టు పనుల కోసం వాహనాలు తిరిగేలా నిర్మించిన ఈ కాజ్‌వే వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.


ఇటు దిగువన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా గోదావరి నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. ప్రవాహం ఇంతకంటే ఎక్కువైతే, బ్యారేజ్‌ గేట్ల ఎత్తి నీటిని నేరుగా దిగువకు వదిలేస్తారు. కిందకు వదిలిన నీరంతా సముద్రంలో కలవనుంది.


Godavari River
Polavaram Project
Godavari Floods
Dowleswaram Barrage
Andhra Pradesh Rains
Maharashtra Heavy Rains

More Telugu News